: ఫ్లిప్ కార్ట్ లో కెమెరా ఆర్డర్ చేశాడు... పార్సిల్ విప్పి చూసి షాక్ తిన్నాడు!
ఆన్ లైన్ లో ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసేందుకు ఆర్డర్ ఇస్తున్నారా? అయితే ఒకటికి రెండు సార్లు ఆలోచించండి... మీరు ఆర్డర్ ఇచ్చిన వస్తువుల స్థానంలో ఇటుకలు, రాళ్లు, మీరు ఆర్డర్ ఇచ్చిన వస్తువులాంటి బొమ్మలు రావచ్చు. హైదరాబాదులోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగోల్ మమతా నగర్ కాలనీకి చెందిన వినయ్ (24) కెనాన్ ఈవోఎస్ 700డి డీఎస్‌ఎల్‌ఆర్ కెమెరా ను ఫ్లిప్ కార్ట్ లో 41,000 రూపాయలకు కొనుగోలు చేసేందుకు ఆర్డర్ చేశాడు.
ఈ క్రమంలో ఈ నెల 5న డెలివరీ బాయ్ తెచ్చిన పార్సిల్ చూసిన వినయ్ షాక్ తిన్నాడు. డీఎస్ఎల్ఆర్ కెమెరా స్థానంలో ఒక రాయి, పిల్లలు ఆడుకునే రెండు బొమ్మ కెమెరాలు ఉన్నాయి. దీంతో వినయ్ నేరుగా ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఫ్లిప్ కార్ట్ ను సంప్రదించగా, తాము పటిష్ఠ భద్రత నడుమ పార్శిల్ ను ప్యాక్ చేస్తామని... డెలివరీ కంపెనీ మోసం చేసి ఉంటుందని, ఇందులో తమ బాధ్యత ఏమీ లేదని ఫ్లిప్ కార్ట్ చేతులెత్తేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, సీసీ పుటేజ్ ఇతర ఆధారాలతో దర్యాప్తు ప్రారంభించారు.