: `మా వారు ఆత్మహత్య చేసుకుంటే బాధ్యత మీదే!`... కమిషనర్‌కు లేఖలో పోలీసు భార్య
`రోజుకి 12 గం.ల పనిభారం వల్ల మా వారు కుటుంబంతో సమయం గడపలేకపోతున్నాడని, దీంతో వారు డిప్రెషన్‌కి గురై ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉందని, ఒకవేళ అలా జరిగితే దానికి బాధ్యత పోలీసు శాఖదే` అంటూ ఓ పోలీసు అధికారి భార్య, ఢిల్లీ పోలీసు కమిషనర్ అమూల్య పట్నాయక్‌కి ఈ-మెయిల్ పంపింది. ఒకరోజులో 12గం.లు నిలబడి పనిచేయడం కష్టమని, కుదిరితే షిఫ్ట్‌ల పద్ధతిలో తన భర్తకు డ్యూటీ వేయించండని ఆమె లేఖలో పేర్కొంది. కమిషనర్ అధికారిక మెయిల్ ఐడీకి వచ్చిన ఈ లేఖలో ఆ మహిళ ఎవరి గురించి మాట్లాడుతోందో తెలియజేయలేదు.
అయితే తన భర్త రాష్ట్రపతి భవన్ సెక్యూరిటీ యూనిట్‌లో పనిచేస్తున్నాడని మాత్రం తెలిపింది. అక్కడ 700 మంది పోలీసు బలగం, నలుగురు ఏసీపీలు, ఒక డీసీపీ, ఒక జాయింట్ సీపీ పనిచేస్తున్నారు. ఆ మహిళ కోరినట్లుగానే చర్యలు తీసుకునేందుకు అమూల్య పట్నాయక్ ఆ మెయిల్‌ను సంబంధిత డీసీపీకి పంపించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ పోలీసు శాఖలో పని ఒత్తిడి వల్ల చాలా మంది కింది స్థాయి పోలీసు అధికారులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు గతంలో జరిగాయి. ఆ భయంతోనే ఆ మహిళ లేఖ రాసి ఉంటుందని సీనియర్ అధికారులు అభిప్రాయపడుతున్నారు.