: నిబంధనలు మారనున్నాయ్... విమానం టికెట్ కొనాలంటే గుర్తింపు కార్డు తప్పనిసరి


దేశీయ విమానయానంపై కేంద్రం కొత్త ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇప్పటివరకూ విదేశీ ప్రయాణానికి పాస్ పోర్టు అవసరం ఉండగా, స్వదేశంలో ప్రయాణానికి టికెట్ బుక్ చేసుకునే వేళ, ఎటువంటి ఐడీ కార్డు అవసరం ఉండదన్న సంగతి తెలిసిందే. కానీ ఇకపై అలా కాదు. విమానం టికెట్ బుక్ చేసుకునే వేళ, ఐడీ కార్డు నకలును జతపరచాల్సిందే. దేశీయ ప్రయాణానికి ఆధార్ కార్డు ఉండాలని లేకుంటే డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు లేదా ఓటర్ ఐడీలలో ఒకటి తప్పనిసరని విమానయాన శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా తెలిపారు.

మంగోలియాలో విమానయాన భద్రతపై ఓ సదస్సు జరుగగా, అందులో పాల్గొని వచ్చిన ఆయన 'నో ఫ్లయ్' జాబితాపై నిబంధనలను రూపొందించినట్టు కూడా తెలిపారు. వీటిని శుక్రవారం నాడు విడుదల చేయనున్నామని తెలిపారు. ఈ జాబితాలోని వారు మారు పేర్లతో టికెట్లను కొనుగోలు చేయకుండా చూసేందుకు సాధ్యమైనంత త్వరలో డిజిటల్ బోర్డింగ్ కార్డులను ప్రవేశపెట్టనున్నామని అన్నారు. ఇందుకోసం ఆధార్ కార్డులను ఇచ్చి రిజిస్టర్ చేసుకోవాల్సి వుంటుందని పేర్కొన్నారు. విమానాల భద్రత, అవాంఛనీయ ఘటనల నివారణ లక్ష్యంగా నో ఫ్లయ్ జాబితా నిబంధనలను తయారు చేసినట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ చీఫ్ బీఎస్ బుల్హార్ తెలిపారు. వచ్చే సంవత్సరం జూలై నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రావచ్చని అన్నారు.

  • Loading...

More Telugu News