: కృష్ణా జిల్లాలో నందమూరి యువసేన కార్యకర్తల వీరంగం!
కృష్ణా జిల్లాలో నందమూరి యువసేన కార్యకర్తలు సృష్టించిన వీరంగం హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే, జిల్లాలోని కంచికచర్లలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థులు నందమూరి యువసేన పేరుతో పేరకలపాడు రోడ్డు పక్కన ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు కార్లు, బైకులతో క్రాస్ రోడ్ నుంచి కంచికచర్ల వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా, హైవేపై మరమ్మతు పనులు చేపడుతున్న కార్మికులు తమకు రక్షణగా ఏర్పాటు చేసుకున్న ప్లాస్టిక్ కోన్ లను తొక్కిస్తూ ముందుకు సాగారు. ఈ క్రమంలో, అక్కడ కొంత మేర భయానక వాతావరణం నెలకొంది. అనంతరం, కార్మికులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అయితే, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు కార్మికులతో మాట్లాడి, కేసు పెట్టవద్దని నచ్చ చెప్పారు. దీంతో, వ్యవహారం అంతా సర్దుకుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.