: చైనా అధ్యక్షుడితో 'అతి ముఖ్యమైన' ఫోన్ కాల్ మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్!

తరచూ అణు పరీక్షలను నిర్వహిస్తూ ఉద్రిక్తతలను పెంచుతున్న ఉత్తర కొరియాపై తమ తొలి నిర్ణయం సైనిక చర్య కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. బుధవారం నాడు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో ఫోన్లో మాట్లాడిన ఆయన, ఉత్తర కొరియా విషయంలో తను, జిన్ పింగ్ ఏకాభిప్రాయంతో ఉన్నట్టు స్పష్టం చేశారు. వీరిద్దరి సంభాషణలపై మీడియా సంస్థల్లో వచ్చిన వివరాలను బట్టి, సైనిక చర్యపై తొలుత జిన్ పింగ్ ప్రస్తావించారు. ఉత్తర కొరియాపై సైనిక ప్రయోగం చేస్తారా? అన్న ప్రశ్నకు, అదే తమ తొలి నిర్ణయం కాదని, ఇప్పటికిప్పుడు అటువంటి నిర్ణయాన్ని తీసుకోబోమని, అయితే పరిస్థితి చేజారితే మాత్రం అంతకుమించి మరో మార్గం ఉండదని ఆయన వెల్లడించారు.

 కిమ్ జాంగ్ విషయమై ఆచితూచి వ్యవహరించాలన్నదే ట్రంప్ అభిమతమని తెలుస్తోంది. 'ఈ ఫోన్ కాల్ చాలా ఇంపార్టెంట్' అని జిన్ పింగ్ తో మాట్లాడిన తరువాత ట్రంప్ వ్యాఖ్యానించారని సమాచారం. కాగా, మిగతా అగ్రదేశాలు ఏకతాటిపైకి వచ్చి, ఉత్తర కొరియా అణు పరీక్షల విషయంలో కల్పించుకోవాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెర్రస్ కోరిన సంగతి తెలిసిందే. కాగా, యూఎస్ కు అతి త్వరలో మరిన్ని బహుమతులు పంపిస్తామని నార్త్ కొరియా అధికారి ఒకరు వ్యాఖ్యానించడంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుప్పకూలిన సంగతి తెలిసిందే.

More Telugu News