: మొత్తానికి పాకిస్థాన్ ఒప్పేసుకుంది.. లష్కరే, జేషేలు తమ దగ్గరే ఉన్నాయని తొలిసారి అంగీకరించిన దాయాది!
పాకిస్థాన్ ఎట్టకేలకు నిజాన్ని అంగీకరించింది. భారత్ ఎప్పటి నుంచో చెబుతున్న విషయాన్ని ఇన్నాళ్లకు ఒప్పుకుంది. లష్కరే తాయిబా, జేషే మహ్మద్ వంటి సంస్థలు తమ భూభాగం నుంచే తమ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్టు బహిరంగంగా అంగీకరించింది. అంతేకాదు.. వాటిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించింది. లష్కరే, జైషేపై కార్యకలాపాలను అడ్డుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని, తద్వారా ఉగ్రవాదంపై తాము తీసుకుంటున్న చర్యలను ప్రపంచానికి చాటుతామని పాకిస్థాన్ విదేశాంగ శాఖామంత్రి ఖ్వాజా ముహమ్మద్ అసిఫ్ తెలిపారు. ఈ ప్రాంత సుస్థిరతకు జైషే మహ్మద్, లష్కరే తదితర ఉగ్రవాద సంస్థల నుంచి ముప్పు వాటిల్లుతోందని మూడు రోజుల క్రితం చైనాలో జరిగిన బ్రిక్స్ సదస్సు డిక్లరేషన్ చేసింది. దీనికి స్పందించిన పాక్ ఈ వ్యాఖ్యలు చేసింది. టెర్రరిజంపై ఉపేక్షించి తమ స్నేహితులను పరీక్షించే ఉద్దేశం తమకు లేదని ఆయన పేర్కొన్నారు.
కాగా, బ్రిక్స్ డిక్లరేషన్ తర్వాత పాకిస్థాన్ అగ్గిమీద గుగ్గిలమైంది. తమ దేశం ఉగ్రవాదులకు స్వర్గధామం కాదని ఆ దేశ రక్షణ మంత్రి ఖుర్రం దస్తగిర్, విదేశీ మంత్రిత్వ కార్యాలయం పేర్కొన్నాయి. అయితే అంతలోనే మాట మార్చిన పాక్ తాజా ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. తమ దేశంలో జరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి ఇప్పటి వరకు కళ్లు మూసుకున్నామని, అదంతా ఇక గతమని విదేశాంగ మంత్రి ఖ్వాజా ముహమ్మద్ పేర్కొన్నారు. తన ప్రకటనలో రాజకీయం ఏమీ లేదని, ఇక కళ్లు మూసుకోబోమని పేర్కొన్నారు. ఇకపై కూడా అలాగే ప్రవర్తిస్తే ప్రపంచం నుంచి ఇటువంటి ప్రకటనలే వస్తాయని బ్రిక్స్ డిక్లరేషన్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు.