: శ్రీలంకను ఊడ్చి పారేసిన భారత్.. టీ20 కూడా టీమిండియాదే!
శ్రీలంక టూర్‌ను భారత్ మరో తిరుగులేని విజయంతో ముగించింది. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను, ఐదు మ్యాచ్‌ల పరిమిత ఓవర్ల సిరీస్‌ను ఇప్పటికే కైవసం చేసుకున్న కోహ్లీ టీం బుధవారం జరిగిన ఏకైక టీ20లోనూ ఘన విజయం సాధించి శ్రీలంక సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. శ్రీలంక తన చెత్త ప్రదర్శనతో సిరీస్‌లో ఏ దశలోనూ భారత్‌కు పోటీ ఇవ్వలేకపోయింది.
టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోహ్లీ శ్రీలంకకు బ్యాటింగ్ అప్పగించాడు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని తాపత్రయపడిన లంకేయుల ఆశ ఫలించలేదు. భారత బౌలర్లు ఏ దశలోనూ లంక బ్యాట్స్‌మెన్‌ను క్రీజులో కుదురుకోనివ్వలేదు. యుజ్వేంద్ర చాహల్ మూడు వికెట్లు తీసి లంకను దెబ్బకొట్టాడు. కుల్దీప్ యాదవ్ 2, భువనేశ్వర్ కుమార్, బుమ్రా చెరో వికెట్ తీసి లంక భరతం పట్టారు. లంక బ్యాట్స్‌మెన్‌లలో దిల్షాన్ మునవీరా ఒక్కడే ధాటిగా ఆడి 29 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 53 పరుగులు చేసి కాసేపు మెరుపులు మెరిపించాడు. ఆ తర్వాత అషాన్ ప్రియంజన్ 40 పరుగులు చేశాడు. మిగతా వారిలో ఎవరూ కనీసం 20 పరుగులు కూడా చేయలేకపోయారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో లంక ఏడు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది.
171 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 22 పరుగుల వద్ద ఓపెనర్ రోహిత్ శర్మ (9) వికెట్‌ను కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీ.. లోకేశ్ రాహుల్ (24)తో కలిసి రెచ్చిపోయాడు. 54 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో స్కోరు బోర్డును ఉరకలెత్తించాడు. ఈ క్రమంలో 82 పరుగుల వద్ద అవుటయ్యాడు. మనీష్ పాండే 36 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 51 పరుగులు (నాటౌట్) చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో భారత్ మరో నాలుగు బంతులు ఉండగానే 174 పరుగులు చేసి విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌లు రెండూ కెప్టెన్ కోహ్లీని వరించాయి.