: పోలీసులు వెంబడించడంతో.. 88 కేజీల బంగారాన్ని కారులో వదిలి పారిపోయిన దంపతులు
పోలీసులు తమను వెంబడిస్తుండడంతో బెదిరిపోయిన ఓ దంపతులు 88 కేజీల బంగారాన్ని కారులో వదిలి పారిపోయిన ఘటన నేపాల్‌లో చోటు చేసుకుంది. ఆ దంపతులు చైనాకు చెందిన వారని, వారి పేర్లు వాన్‌మియ్ మింగ్ (50), యాంగ్ వై మింగ్ అని పోలీసులు తెలిపారు. వారు నేపాల్‌లోని తామెల్ ప్రాంతంలో ఉంటూ ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్నారని, దానితో పాటు బంగారం అక్రమంగా తీసుకువచ్చి అమ్ముతున్నారని చెప్పారు.
వీరు చైనా-నేపాల్ సరిహద్దు ‘రాసువగాది- కెరుంగ్’ గుండా కారులో వెళుతోన్న సమయంలో అనుమానం కలిగి తాము వెంబడించామని పోలీసులు చెప్పారు. దీంతో వారు కారును రోడ్డు పక్కన వదిలేసి పారిపోయారని తెలిపారు. ఆ కారులో స్వాధీనం చేసుకున్న బంగారు బిస్కెట్ల విలువ సుమారు 440 మిలియన్ డాలర్లు ఉంటుందని చెప్పారు. ఇంత భారీ మొత్తంలో బంగారం పట్టుబడడం నేపాల్ చరిత్రలోనే తొలిసారి.