: హీరోయిన్ కంగనా రనౌత్ చేసిన ఆరోపణలపై మహిళా కమిషన్ సీరియస్!
బాలీవుడ్ నటి కంగనా రనౌత్, నటుడు హృతిక్ రోషన్‌ల మధ్య గత ఏడాది తారస్థాయిలో వివాదం చెలరేగి, పరస్పరం లీగల్ నోటీసులు పంపించుకునేవరకు వెళ్లిన విషయం తెలిసిందే. హృతిక్‌పై ఉన్న కోపాన్ని మళ్లీ బయటపెడుతోన్న కంగనా మహిళా కమిషన్‌పై కూడా పలు ఆరోపణలు చేసింది. తాను ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో మహిళా కమిషన్ తనకు ఏ మాత్రం సాయం చేయలేదని ఆమె ఆరోపణలు చేసింది.
మహిళా కమిషన్‌కు చెందిన గుర్మీత్ చద్దా అనే అధికారిణి తనకు సాయం చేయలేదని, సరైన సమయంలో తనకు అండగా నిలవలేదని, ఇది చాలా అన్యాయమని ఆమె వ్యాఖ్యానించింది. అయితే, దీనిపై మహారాష్ట్ర మహిళా కమిషన్ చీఫ్ విజయ రహత్కర్ స్పందిస్తూ.. అసలు తమ కమిషన్‌లో గుర్మీత్ పేరుతో ఎవరూ లేరని చెప్పారు. అంతేగాక, కంగనా రనౌత్ అసలు మహిళా కమిషన్‌ను ఎన్నడూ ఆశ్రయించలేదని ఆమె చెప్పారు. ఆపదలో ఉన్న మహిళలకు మద్దతుగా నిలుస్తోన్న మహారాష్ట్ర మహిళా కమిషన్‌పై ఇటువంటి ఆరోపణలు చేయకూడదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.