: మంత్రి భూమా అఖిలప్రియ సంతకం ఫోర్జరీ చేసి.. ఆ లెటర్ ను ఆమెకే ఇచ్చిన ఘనుడు!
ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ సంతకం ఫోర్జరీ చేసిన వ్యవహారం ఒకటి బయటపడింది. అలీ అనే వ్యక్తికి వారం రోజుల్లోగా ఉద్యోగం ఇవ్వాలంటూ మంత్రి అఖిలప్రియ సిఫారసు చేసినట్టు ఓ లేఖను రాసి, ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి.. చివరికి ఆ లేఖను ఆమెకే ఇచ్చిన సంఘటన ఆశ్చర్యం కలిగిస్తోంది. అలీకి టూరిజం శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వాలని అఖిలప్రియ సిఫారసు చేసినట్టు ఉన్న ఈ లేఖను తీసుకుని ప్రిన్సిపల్ సెక్రటరీ వద్దకు వెళ్లగా, అతన్ని మంత్రి వద్దకు పంపించారు. ఈ నకిలీ సిఫారసు లేఖను స్వయంగా అఖిలప్రియకే అతను అందజేశాడు.
దీంతో,ఈ సంతకం చూసి కంగుతిన్న అఖిలప్రియ, ‘ఈ సంతకం ఎవరు చేశారు?’ అంటూ ప్రశ్నించగా అతను తెల్లముఖం వేసినట్టు సమాచారం. దీంతో, తన పేషీకి అఖిలప్రియ ఈ సమాచారం అందించడంతో ఎస్ఫీఎఫ్ సిబ్బందికి అతన్ని అప్పగించారు. కాగా, మంత్రులు, ఎమ్మెల్యేల నకిలీ లెటర్ ప్యాడ్స్ ను తయారు చేసి వాటిపై ఫోర్జరీ సంతకాలకు అలీ పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ ఫోర్జరీకి పాల్పడిన వ్యక్తి గుంటూరు జిల్లా పెదకూరపాడుకు చెందిన అలీగా గుర్తించినట్టు మంత్రి కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు.