: బ్లూవేల్‌ గేమ్‌ బారి నుంచి బ‌య‌ట‌ప‌డి.. త‌నకు ఎదురైన భ‌యాన‌క‌ అనుభ‌వాల‌ను వివ‌రించిన యువ‌కుడు


పుదుచ్చేరిలోని నేరవే జిల్లాకు చెందిన 22 ఏళ్ల‌ అలెగ్జాండర్‌ బ్లూవేల్‌ గేమ్ ఆడుతుండ‌గా ఆ యువ‌కుడి ప‌రిస్థితిని గ‌మ‌నించిన అత‌డి సోదరుడు అజిత్‌ వెంటనే పోలీసులకు సమాచారమందించాడు. నిన్న ఉద‌యం నాలుగు గంటల సమయంలో అలెగ్జాండర్‌ తన చేతి మీద కత్తితో బ్లూవేల్ మార్క్ వేసుకుంటోన్న స‌మ‌యంలో పోలీసులు అదే స‌మ‌యంలో ఆ యువ‌కుడి ఇంటికి వెళ్లి కాపాడారు. అలెగ్జాండ‌ర్‌కి కౌన్సెలింగ్‌ ఇచ్చామ‌ని, ప్ర‌స్తుతం అతడిలో మార్పు వచ్చిందని పోలీసులు చెప్పారు. ఈ సంద‌ర్భంగా మీడియాకు ఆ యువ‌కుడు ఈ గేమ్ గురించి తెలిపాడు.

ఈ గేమ్ జోలికి పొరపాటున కూడా పోవ‌ద్ద‌ని అన్నాడు. త‌నకు ప‌ది రోజుల క్రితం వాట్సప్‌ గ్రూపులో బ్లూవేల్‌ గేమ్‌ లింక్‌ వచ్చిందని, తాను దానిపై క్లిక్ చేసి ఆ ఆట‌ను ఆడ‌డం ప్రారంభించాన‌ని తెలిపాడు. ఈ గేమ్‌ అడ్మిన్‌ ప్రతి రోజూ తెల్లవారుజామున 2 గంటల తర్వాత కొన్ని టాస్క్‌లు ఇస్తాడని ఆ యువ‌కుడు వివ‌రించాడు. కొన్ని రోజులు గేమ్ ఆడేవారి వ్యక్తిగత వివరాలు, ఫొటోలను అడ్మిన్‌కు పంపించాల్సి ఉంటుందని చెప్పాడు.
 
అలాగే ఓ రోజు అర్ధ‌రాత్రి శ్మశానానికి వెళ్లి సెల్ఫీ తీసుకొని ర‌మ్మ‌న్నాడ‌ని, వెంటనే తాను ఆ ప‌ని చేశాన‌ని చెప్పాడు. ఆ త‌రువాత ఒంట‌రిగా కూర్చొని హ‌ర్ర‌ర్ సినిమాలు చూడాల‌ని చెప్పాడ‌ని, తాను అలాగే చేసేవాడిన‌ని చెప్పాడు. తాను ఎవ‌రితోనూ మాట్లాడ‌కుండా త‌న‌ గదిలోనే కూర్చొని మానసికంగా కృంగిపోయాన‌ని తెలిపాడు. ఆ గేమ్‌ నుంచి బయటపడాలని ఎంత‌గా అనుకున్నా అది త‌న వ‌ల్ల కాలేద‌ని చెప్పాడు.  

  • Loading...

More Telugu News