చంద్రబాబు నాయుడు: ఎటువంటి సమస్యలు ఉన్నా 1100కు ఫోన్ చేయండి: చంద్రబాబు
నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జలసిరికి హారతి కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈ రోజు విశాఖపట్నం జిల్లా కశింకోట మండలం నర్సాపురంలో జలసిరికి హారతి కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు.. అనంతరం నర్సాపురం ఆనకట్టను ప్రారంభించి, అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. తాము రాష్ట్రంలో ఆడబిడ్డల కోసం దీపం పథకం ప్రారంభించామని చెప్పారు.
ఏపీలో 18 లక్షల మరుగుదొడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని చంద్రబాబు చెప్పారు. వృద్ధాప్య పింఛన్ల మొత్తాన్ని రూ.1000కి పెంచామని అన్నారు. హుద్హుద్తో అతలాకుతలమైన విశాఖపట్నాన్ని మళ్లీ సుందరంగా తీర్చిదిద్దామని చెప్పారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందే క్రమంలో ఎవరయినా అధికారులు డబ్బులు అడిగినా, ఎటువంటి సమస్యలు ఉన్నా 1100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని చెప్పారు. సంక్షేమ పథకాల అమలులో లబ్ధిదారులందరికీ న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. ప్రతి ఒక్కరూ వాన నీటిని ఒడిసిపట్టేందుకు కృషిచేయాలని, చెరువులు, కాలువల ద్వారా వాటిని ఉపయోగించుకోవాలని చెప్పారు.