: 1994 ఎన్నికల్లో రిగ్గింగ్ చేయకపోతే వైయస్సార్, జేసీ కూడా ఓడిపోయేవారు: బైరెడ్డి సంచలన వ్యాఖ్యలు
1994లో ఎన్టీఆర్ తనను పిలిచి టీడీపీలో చేర్చుకున్నారని కర్నూలు జిల్లా నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి తెలిపారు. ఆనాడు ఎన్టీఆర్ తో కలసి నిర్వహించిన సభకు లక్షలాది మంది ప్రజలు హాజరయ్యారని చెప్పారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబంతో కూడా తనకు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. అప్పట్లో ముచ్చుమర్రికి పీవీ రావడంతో జిల్లాకు చెందిన ఓ నాయకుడు ఓర్వలేక, తనపై కక్షగట్టి ఇబ్బందులకు గురి చేశారని చెప్పారు. ఆ తర్వాత ఎన్టీఆర్ తనను టీడీపీలోకి ఆహ్వానించారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైయస్ రాజశేఖరరెడ్డిలాంటి నేతలున్నారని... మీకు ఎవరున్నారు? అని ఎన్టీఆర్ ను ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులుగా... 'మాకు బైరెడ్డి ఉన్నారు బ్రదర్' అంటూ ఎన్టీఆర్ చెప్పిన సమాధానాన్ని గుర్తు చేసుకున్నారు. అవినీతికి తావు లేకుండా, నిస్వార్థమైన రాజకీయాలు చేశానని చెప్పారు. ఆనాడు బలహీనంగా ఉన్న టీడీపీని బలోపేతం చేసి, అధికారంలోకి వచ్చామని తెలిపారు. 1994 ఎన్నికల్లో రిగ్గింగ్ చేయకపోతే వైయస్సార్, జేసీ దివాకర్ రెడ్డిలు కూడా ఓడిపోయేవారని చెప్పారు. తనకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీలోనే చేరుతానని తెలిపారు.