: ఢిల్లీ పోలీసులు ఉపయోగించిన మొదటి వైర్‌లెస్ సెట్ ఇదే!
సుదీర్ఘ చరిత్రగల ఢిల్లీ పోలీసు శాఖ తనకు సంబంధించిన ఒక్కో చారిత్రక విషయాన్ని ఈమధ్య అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రజలతో షేర్ చేసుకుంటోంది. అందులో భాగంగా 1944లో ఢిల్లీ పోలీసులు ఉపయోగించిన మొదటి వైర్‌లెస్ సెట్ ఫొటోను ఢిల్లీ పోలీసు విభాగం పోస్ట్ చేసింది. ఇటీవల ఢిల్లీ పోలీసులు 1861లో రికార్డు చేసిన ఎఫ్ఐఆర్ ఫొటోను కూడా వారు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దేశ యువతతో ఇంటర్నెట్ ద్వారా సంబంధాలను పెంచుకోవడానికే పోలీసు శాఖకు సంబంధించిన చారిత్రక విషయాలను పంచుకుంటున్నట్లు డీసీపీ మాధుర్ వర్మ తెలిపారు. వీటితో పాటు ఢిల్లీకి సంబంధించిన కొన్ని ప్రముఖ చారిత్రక ఘట్టాలకు చెందిన ఆధారాలను కూడా ఢిల్లీ పోలీసు విభాగం తమ ట్విట్టర్ అకౌంట్లో ప్రతి గురువారం ప్రజలతో పంచుకుంటోంది.