: మోదీ నన్ను రెండు సార్లు తిట్టారు: కేంద్ర మంత్రి ఉమాభారతి
కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా మొన్నటిదాకా బాధ్యతలను నిర్వహించిన ఉమాభారతికి మొన్నటి మంత్రివర్గ విస్తరణలో తాగునీరు, పారిశుద్ధ్యం శాఖలను ప్రధాని మోదీ అప్పగించిన సంగతి తెలిసిందే. జలవనరుల మంత్రిగా ఉమాభారతి సమర్థవంతంగా పనిచేయకపోవడం వల్లే ఆమెకు పోర్ట్ ఫోలియో మార్చారనే ప్రచారం జరిగింది. ఇదే విషయం గురించి మీడియా ఆమెను ప్రశ్నించగా ఆమె చమత్కారంతో కూడిన సమాధానాన్ని ఇచ్చారు.
బాధ్యతల నిర్వహణకు సంబంధించి తనను మోదీ ఏనాడూ ఒక్క మాట కూడా అనలేదని... అయితే తన అధిక బరువును ఉద్దేశించి మాత్రం రెండు సార్లు చివాట్లు పెట్టారని... బరువు తగ్గాలంటూ గట్టిగా చెప్పారని తెలిపారు. ఏదేమైనప్పటికీ గంగానది నుంచి తనను ఎవరూ దూరం చేయలేరని ఆమె అన్నారు. పారిశుద్ధ్య శాఖ మంత్రిగా తాను ఇప్పుడు గంగానది చెంతనే ఉండి పని చేస్తానని చెప్పారు. శాఖ మారినా కేంద్ర కేబినెట్ సమావేశాల్లో తన ఆలోచనలు పంచుకునే అవకాశం తనకు ఎప్పటికీ ఉంటుందని తెలిపారు. వచ్చే నెలలో తాను చేపట్టబోతున్న గంగా యాత్రకు అనుమతి ఇచ్చినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.