: నా జీవితంలో సినిమా దశ ముగిసిపోయింది: బాలీవుడ్ డ్రీమ్ గర్ల్
తన జీవితంలో సినిమాల్లో నటించే దశ ముగిసిపోయిందని బాలీవుడ్ డ్రీమ్ గర్ల్, బీజేపీ ఎంపీ హేమ మాలిని అభిప్రాయపడ్డారు. సినర్జీ 2017 పేరిట హేమ ముంబయిలో సాంస్క్రతిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, సినిమాల్లో నటిస్తున్నావా? అని పార్లమెంట్ సహచరులు అడుగుతుంటారని, అయితే ప్రస్తుతం నటించడం లేదని, గతంలో తాను నటించిన ‘భాగ్ బన్’ లాంటి కథ దొరికితే తప్పకుండా నటిస్తానని సమాధానం చెబుతానని అన్నారు.
అంత మంచి కథ దొరకకపోతే నటించనని, అయితే నాట్య ప్రదర్శనలు మాత్రం ఆపనని ఆమె చెబుతున్నారు. అలాగే కేంద్ర మంత్రి పదవి గురించి కూడా అడుగుతుంటారని, అయితే కేంద్ర మంత్రి అయ్యే అర్హత తనకు లేదనేది తన అభిప్రాయమని ఆమె తెలిపారు. ప్రస్తుతం తన బాధ్యతలతో సంతోషంగా ఉన్నానని ఆమె చెప్పారు. మంత్రి అయితే ప్రజలతో కలిసే అవకాశం ఉండదని ఆమె తెలిపారు. మధురలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, కళా రంగానికి కొంత సేవచేయాలని అందుకు కృషి చేస్తున్నానని ఆమె తెలిపారు.