: సహనం కోల్పోయిన బాలీవుడ్ నటుడు సన్నీడియోల్.. మీడియాపై చిందులు!
సన్నీడియోల్.. వివాద రహితుడిగా, నిత్యం కూల్‌గా ఉండే వ్యక్తిగా మంచి పేరున్న బాలీవుడ్ నటుడు. కానీ ఇటీవల ఆయన సహనం కోల్పోయి మీడియాపై చిందులు తొక్కాడు. సహజ వ్యక్తిత్వానికి భిన్నంగా ప్రవర్తించాడు. విలేకరులు అడిగిన ప్రశ్నే ఇందుకు కారణం.
సన్నీడియోల్ కుమారుడు కరణ్ త్వరలో ‘పల్ పల్ దిల్ కె పాస్’ సినిమాతో బాలీవుడ్‌లో అరంగేట్రం చేయనున్నాడు. సొంత బ్యానర్ విజేత ఫిల్మ్స్‌పై నిర్మించిన ఈ చిత్రానికి సన్నీనే దర్శకుడు. అయితే కొత్త ముఖాలను ఇండస్ట్రీకి పరిచయం చేసేందుకు చాలామంది ధర్మా ప్రొడక్షన్స్‌ను కానీ, యశ్‌రాజ్ ఫిల్మ్స్‌ను కానీ ఎంచుకుంటారు. అయితే సన్నీ మాత్రం సొంత బ్యానర్‌తో తన కొడుకును పరిచయం చేస్తుండడంపై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఊగిపోయాడు.
‘‘ ఏం, ఎందుకు? విజేత ఫిల్మ్స్ అందుకు పనికిరాదా? దీనివల్ల ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉందా?’’ అని ప్రశ్నించాడు. డియోల్‌లు అందరూ విజేత ద్వారా వచ్చిన వారేనని, ‘బేతాబ్’లో తాను, ‘బర్సాత్’ ద్వారా బాబీడియోల్, ‘సోచ్ నా థా’ లో అభయ్ డియోల్.. ఇలా అందరం విజేత ద్వారా వచ్చిన వారమేనని వివరించాడు. తాను కరణ్ తండ్రినని పేర్కొన్న సన్నీ, అతడికి నేను మంచి చేయలేనని మీరు భావిస్తున్నారా? అని ఎదురు ప్రశ్నించాడు. కరణ్ ఒకవేళ వేరే బ్యానర్‌లో నటించినా విజేత కూడా అందులో భాగం అయ్యేదని సన్నీడియోల్ పేర్కొన్నాడు.