: అయినా.. చైనా మారలేదు, దాని బుద్ధి మారలేదు.. మసూద్‌పై యథాతథ స్థితిని కొనసాగిస్తున్న డ్రాగన్ కంట్రీ!
బ్రిక్స్ సదస్సులో భారత్ లేవనెత్తిన ఉగ్రవాదం అంశానికి సభ్యదేశాలు సానుకూలంగా స్పందించాయి. చైనా అయితే ఏకంగా మిత్రదేశం పాకిస్థాన్‌కు ఈ విషయంలో హెచ్చరికలు పంపింది. ఆ దేశంలోని ఉగ్ర సంస్థలను మూసివేయాలని, ఉగ్రవాదుల భరతం పట్టాలని అల్టిమేటం జారీ చేసింది. దీంతో టెర్రరిజంపై చైనా వైఖరి మారుతోందని ప్రపంచం ప్రశంసించింది.
అయితే ఆ ప్రశంసలు అర్థం లేనివని చైనా తన చేష్టలతో మరోమారు నిరూపించింది. బ్రిక్స్ సదస్సుకు ముందు చైనా మాట్లాడుతూ.. భారత్ ఈ సదస్సులో పాకిస్థాన్ గురించి కానీ, సీమాంతర ఉగ్రవాదం గురించి కానీ మాట్లాడరాదని కోరింది. అయితే భారత్ ఆ వ్యాఖ్యలను పట్టించుకోలేదు. ముందు చెప్పినట్టుగానే సదస్సులో పాకిస్థాన్ గురించి, అది ప్రేరిపిస్తున్న ఉగ్రవాదం గురించి ఆందోళన వ్యక్తం చేసింది. విచిత్రంగా చైనా కూడా ఇతర సభ్య దేశాలతో కలిసి భారత్ లేవనెత్తిన అంశాలపై మద్దతు పలికింది. దీంతో ఉగ్రవాదంపై ఆ దేశ వైఖరి మారుతున్నట్టు కనిపిస్తోందని విశ్లేషకులు అంచనా వేశారు.
పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాది, జైషే చీఫ్ మసూద్ అజర్‌పైనా తన వైఖరి మార్చుకుంటుందని అందరూ భావించారు. అయితే తన వక్రబుద్ధి ఎప్పటికీ మారబోదని డ్రాగన్ కంట్రీ మరోమారు ప్రపంచానికి తెలియజేసింది. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా, పాకిస్థాన్‌ను ఉగ్ర దేశంగా ప్రకటించాలని కోరుతూ ఐక్యరాజ్య సమితిలో భారత్ చేసిన విజ్ఞప్తిని తనకున్న విచక్షణాధికారంతో తొలి నుంచీ అడ్డుకుంటున్న చైనా .. తాజాగా ఆ విషయంలో మార్పేమీ ఉండదని ప్రకటించింది. మసూద్‌పైనా, పాకిస్థాన్‌పైనా యథాతథ స్థితిని కొనసాగిస్తామని తేల్చి చెప్పింది.