: పాత్ర కోసం గుండు చేయించుకున్న సినీ నటి!
సినిమాల్లో హీరో, హీరోయిన్లు గ్లామర్ గా కనిపించాలని అభిమానులు ఆశిస్తారు. పాత్ర కోసం కొన్ని మార్పులు చేర్పులు చేయాలన్నా మేకప్ తో వాటిని చేస్తుంటారు. అయితే పియా బాజ్ పేయ్ మాత్రం మలయాళ సినిమా కోసం చాలా ధైర్యం చేసింది. సినిమాటోగ్రాఫర్ ఆర్.విజయలక్ష్మి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అభియుం అనువుం’ సినిమాలో మలయాళ నటుడు డోవినో థామస్, పియా బాజ్ పేయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో కీలక సన్నివేశంలో కథానాయిక గుండుతో కనిపించాల్సి ఉంటుంది. దీనిని మేకప్ ద్వారా చేద్దామన్నప్పటికీ, పాత్ర పండాలని పియా బాజ్ పేయ్ గుండు చేయించుకుంది.
దీనిపై ఆమె చెబుతూ, ఇలాంటి కథలో నటించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పింది. విజయలక్ష్మి ఫోన్ చేసి కథ చెప్పగానే ఆకట్టుకుందని తెలిపింది. నటీనటులు ఇలాంటి పాత్రల కోసం ఎదురు చూస్తారని, తనను ఆ పాత్ర వెతుక్కుంటూ వచ్చి వరించిందని చెప్పింది. మేకప్ తో నటిస్తే పాత్ర పండదనిపించడంతో గుండు చేయించుకున్నానని చెప్పింది. దీంతో దర్శకురాలే తన వద్దకు వచ్చి... సాధారణంగా గుండు గీయించుకునేందుకు ఏ అమ్మాయి అంగీకరించదని, అందులోనూ కథానాయికలు అస్సలు ఆ పని చేయరని చెప్పింది. తాను ఏదైతే కోరుకున్నానో అదే చేసి చూపించావని మెచ్చుకుందని తెలిపింది. ఈ సినిమా సూపర్ హిట్ ప్రేమ కథా చిత్రాల సరసన నిలుస్తుందని పియా బాజ్ పేయి విశ్వాసం వ్యక్తం చేసింది.