: ఇక రాధేమా వంతు... స్వయం ప్రకటిత దైవ స్వరూపిణి రాధేమాను అరెస్టు చేయనున్న పోలీసులు


వివాదాస్పద ఆధ్యాత్మిక‌ గురువు డేరా స‌చ్చా సౌధా చీఫ్ గుర్మీత్ బాబాకి ఇటీవ‌లే సీబీఐ కోర్టు జైలు శిక్ష విధించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు మ‌రో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, త‌న‌ను తాను దైవస్వరూపిణిగా ప్ర‌క‌టించుకున్న‌ రాధేమాకి కూడా అటువంటి చిక్కులే వ‌చ్చేలా క‌నిపిస్తున్నాయి. ఫగ్వాడా (పంజాబ్‌)కు చెందిన వీహెచ్‌పీ మాజీ నేత సురీందర్‌ మిట్టల్‌ను రాధేమా బెదిరించింద‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో ఆమెపై బెదిరింపులు, వేధింపులు, మతాచారాలను అగౌరవపర్చడం తదితర ఆరోపణలకు సంబంధించి కేసు నమోదు చేయాలని పంజాబ్‌-హరియాణా హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ప్ర‌స్తుతం రాధేమా వ‌ద్ద కూడా గుర్మీత్ బాబాలాగే కోట్ల కొద్దీ ఆస్తి ఉంది.

రాధేమా గురించి బాధితుడు సురీంద‌ర్ మాట్లాడుతూ.. ఆమె మొదట మంచి మాట‌లు చెబుతూ ప‌రిచ‌యం చేసుకుంటుంద‌ని, తర్వాత మోహపువల విసిరి, చివరికి చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతోంద‌ని చెప్పారు. త‌న‌పై ఆమె ఇలాగే ప్ర‌వ‌ర్తించింద‌ని, వాటికి సంబంధించిన ఫోన్‌ రికార్డింగ్స్‌ను కోర్టుకు అందించానని తెలిపారు. ఈ నేప‌థ్యంలోనే కోర్టు ఆమెపై కేసు న‌మోదు చేయాల‌ని ఆదేశించింద‌ని అన్నారు. అంతేగాక‌, సత్సంగ్‌ పేరుతో రాధేమా నగ్న పూజలు నిర్వహించేదని చెప్పారు. గ‌తనెల 23న అన్ని ఆధారాల‌తో సురీందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విచారణకు రావాలని ఆమెను పోలీసులు కోరారు. అయితే, రాధేమా విచార‌ణ‌కు హాజ‌రుకాలేదు. దీంతో సురీంద‌ర్ హైకోర్టును ఆశ్ర‌యించారు. కోర్టు ఆదేశాల‌ ప్రకారం పోలీసులు కేసు న‌మోదు చేసి, రాధేమాను అరెస్టు చేయ‌నున్నారు. ఒకప్పుడు సాధారణ భక్తురాలయిన రాధేమా... అసలు పేరు సుఖ్వీందర్‌ కౌర్. ఆమె 15 ఏళ్ల క్రితం పంజాబ్‌లోని ఫడ్వాడా పట్టణంలో ఒక జాగరణ నిర్వహించి, తనను తాను దుర్గామాత అవతారంగా ప్ర‌క‌టించుకున్నారు. అనంత‌రం ఎన్నో ప్ర‌య‌త్నాలు చేసి భక్తులను న‌మ్మించి మోసం చేస్తూ కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తారు.     

  • Loading...

More Telugu News