: గుండెను పిండేస్తోన్న ఆ బాలిక ఫొటోను చూసి చలించిపోయిన గౌతం గంభీర్.. ఆమె చదువుకు సాయం చేస్తానని హామీ!
‘నీ ఏడుపు నా గుండెను పిండేస్తోందమ్మా’ అంటూ దక్షిణ కశ్మీర్ డీఐజీ ఇటీవల జోహ్రా అనే ఓ బాలిక ఫొటోను పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్ లో విధులు నిర్వర్తిస్తోన్న ఏఎస్ఐ అబ్దుల్ రషీద్ ను ఉగ్రవాదులు కాల్చి చంపిన నేపథ్యంలో అతడి భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహిస్తుండగా ఆయన కూతురు బోరున విలపించింది. ఈ సందర్భంగా తీసిన ఆమె ఫొటోను పోస్ట్ చేస్తూ సదరు డీఐజీ ఈ ట్వీట్ చేశాడు. ఆయన పోస్ట్ చేసిన ఆమె ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఆమె పడుతోన్న బాధపట్ల తాజాగా గౌతమ్ గంభీర్ స్పందిస్తూ భావోద్వేగపూరితంగా ట్వీట్ చేశాడు.
‘జోలపాట పాడి నిన్ను నిద్రపుచ్చలేను కానీ, నీ కలలు సాకారం చేసుకునేందుకు మాత్రం సాయం చేయగలను’ అని గంభీర్ పేర్కొన్నాడు. ఆమె చదువుకునేందుకు పూర్తి సహకారం అందిస్తానని ప్రకటించాడు. ‘జోహ్రా నీ కన్నీళ్లని భూమిపై పడనివ్వకు, బాధతో కార్చుతున్న నీ కన్నీళ్ల భారాన్ని ఆ భూమాత కూడా భరించలేదేమో?.. అమరుడైన నీ తండ్రి అబ్దుల్ రషీద్‌కి సెల్యూట్ చేస్తున్నాను’ అని గంభీర్ పేర్కొన్నాడు. అమరులైన భద్రతా బలగాల పిల్లలకు గంభీర్ సాయం చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టుల అఘాయిత్యానికి బలైన 25 మంది సీఆర్పీఎఫ్ బలగాల పిల్లలకు కూడా తన 'గౌతమ్ గంభీర్ ఫౌండేషన్' ద్వారా వారికి సాయం అందిస్తున్నాడు.