: మొదటిసారి భారత ఆస్కార్ జ్యూరీ అధ్యక్షుడిగా తెలుగు వ్యక్తి
ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు సీవీ రెడ్డిని భారత ఆస్కార్ జ్యూరీ కమిటీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 60 ఏళ్ల ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చరిత్రలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి భారత ఆస్కార్ జ్యూరీకి సారథ్యం వహించనుండటం ఇదే మొదటిసారి. వచ్చే ఏడాది మార్చి 4న జరగనున్న 90వ ఆస్కార్ వేడుకలకు ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో పోటీకి పంపడానికి ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు సి. కల్యాణ్ జ్యూరీ కమిటీని ఎంపిక చేశారు. ఈ కమిటీకి సీవీ రెడ్డి అధ్యక్షత వహించనున్నారు.
2012లో భారత ఆస్కార్ జ్యూరీ కమిటీలో సీవీ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. సీవీ రెడ్డి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పదికి పైగా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. అలాగే కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం `బదిలీ` నంది అవార్డు గెల్చుకుంది. అక్టోబర్ 1లోగా ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో పోటీ పడనున్న చిత్రం వివరాలను ఈ కమిటీ ఆస్కార్ వారికి తెలియజేయాల్సి ఉంది.