: రగులుతున్న ఉత్తర, దక్షిణ కొరియాలు... బలాలు ప్రదర్శించుకుంటున్న ఇరు దేశాలు
క్షిపణి ప్రయోగాల ద్వారా ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తున్న ఉత్తర కొరియాను కట్టడి చేయడానికి దక్షిణ కొరియా అన్నిరకాలుగా ప్రయత్నిస్తోంది. ఇటీవల మరో క్షిపణి ప్రయోగానికి ఉత్తర కొరియా సన్నద్ధమవుతున్నట్లు సంకేతాలు అందుతున్నాయని దక్షిణ కొరియా తెలిపింది. వారిని నియంత్రించడానికి ఆయుధ సంపత్తిని పెంచుకుంటున్నట్లు వెల్లడించింది. అందుకోసం అమెరికా సాయాన్ని కోరినట్లు తెలిపింది. దక్షిణ కొరియాలో అమెరికాకు చెందిన టెర్మినల్ హై-అల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ (థాడ్) క్షిపణి రక్షణ వ్యవస్థలను మోహరిస్తున్నట్లు దక్షిణ కొరియా రక్షణశాఖ వివరించింది. మరోపక్క అమెరికా మోహరింపులను చైనా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. దక్షిణ కొరియాలో అమెరికా అణ్వాయుధాలను కూడా మోహరిస్తోందంటున్న చైనా ఆరోపణలను దక్షిణ కొరియా రక్షణ శాఖ ఖండించింది. ఉత్తర కొరియా అణుపరీక్షలకు ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తూ దక్షిణ కొరియా కూడా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగిస్తున్నట్లు తెలుస్తోంది.