: రవిశంకర్ బోధనలే నన్ను మార్చాయి.. ఇక నుంచి అహింసా మార్గమే!: సాయుధపోరాట మాజీ నేత టిమోచెంకో ప్రకటన
ఒకప్పుడు రక్తపాతాన్ని కొనసాగిస్తూ సాయుధపోరాటం చేసిన వ్యక్తి ఇప్పుడు శాంతి బాట పట్టారు. `ఆర్ట్ ఆఫ్ లివింగ్` అధినేత శ్రీ శ్రీ రవిశంకర్ బోధనలతో పోరాట పంథాను మార్చుకున్నారు. రక్తపాతం సృష్టించిన చేతులతోనే రాజకీయ పార్టీ ఏర్పాటుచేసి ప్రజలకు సేవ చేస్తామని అంటున్నాడు గెరిల్లా గ్రూప్ ‘ఆర్మ్‌డ్ రివల్యూషనరీ ఫోర్సెస్ ఆఫ్ కొలంబియా’ మాజీ నేత టిమోచెంకో. గాంధీ బోధించిన అహింసా మార్గాన్ని పాటిస్తూ, తమ గ్రూపు కొత్తపేరు, సరికొత్త చిహ్నంతో రాజకీయ పార్టీగా ఆవిర్భవిస్తుందని ఆయన తెలిపారు.
ఇటీవల కొలంబియాలోని బొగోటాలో నిర్వహించిన సమావేశంలో టిమోచెంకో ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ సమావేశంలో శ్రీ శ్రీ రవిశంకర్ బోధనలే ఆయన ప్రవర్తన మారడానికి కారణమని టిమోచెంకో చెప్పారు. అహింసా మార్గంలో నడుస్తానని రవిశంకర్‌కు ఆయన మాట ఇచ్చిన విషయాన్ని చెప్పాడు. ఈ సమావేశానికి శ్రీశ్రీ రవిశంకర్ హాజరు కావాల్సి ఉంది. కుదరకపోవడంతో ఆయన తరఫున స్వామి పరమ్‌తేజ్‌ను పంపించారు.