: వెనిస్ నగరాన్ని తలపిస్తున్న బెంగళూరు కాలనీలు
ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు జోరుగా కురిసిన వర్షం కారణంగా బెంగళూరులోని కాలనీలన్నీ వెనిస్ నగరాన్ని తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లన్నీ నీళ్లతో నిండిపోవడంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆ ఒక్కరాత్రే 73 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్టు వాతావరణ శాఖ డైరెక్టర్ సుందర్ మైత్రి తెలిపారు. త్రివేణినగర, కృష్ణరాజపురం, దేవసంద్ర ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది.
థణిసంద్ర, యలహంక, హెబ్బాళ్, బసవనపుర, లాల్‌బాగ్, యడియూరు చెరువులు పొంగి పొర్లాయి. అలాగూ రాజకాలువల మరమ్మతు పనుల కారణంగా అక్కడ ఆగిపోవాల్సిన నీరు నేరుగా ఇళ్లలోకి ప్రవహిస్తోంది. వరద నీరుతో పాటు పాములు, తేళ్లు వంటి విషపురుగులు ఇళ్లలోకి వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి వచ్చిన వాననీటిని యంత్రాల సహాయంతో బయటకు పంపిస్తున్నారు. హెణ్ణూరు రైల్వేక్రాస్ దారిలో మోకాలి లోతున వాననీరు నిలిచి పోవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.
ఇదిలా ఉండగా వర్షం ఇంకా కురుస్తున్న కారణంగా మరమ్మతు పనులు సరిగా చేపట్టలేకపోతున్నామని, అందుకే వర్షం నిలిచిన తర్వాత రహదారుల మరమ్మతు పనులు చేపడతామని బెంగళూరు అభివృద్ధిశాఖ మంత్రి కేజే జార్జి తెలిపారు. ప్రస్తుతానికి అక్కడక్కడ పూడిక పనులు చేపట్టి నీరు సాఫీగా ప్రవహించేలా చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. రహదారుల పనుల కోసం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రూ.800కోట్లు విడుదల చేశారని, వాన నిలిచిన తరువాత ఆ నిధుల్ని ఖర్చు చేస్తామని ఆయన వివరించారు.