: ఉత్తరకొరియాతో మా బంధం చాలా దృఢమైనది... నష్టం అమెరికాకే... ట్రంపే ఆలోచించుకోవాలి!: చైనా


ఉత్తరకొరియాతో వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్న దేశాలు మరోసారి ఆలోచించుకోవాలని...ఆ దేశంతో వ్యాపారం చేయాలనుకుంటే తమతో వ్యాపార సంబంధాలు తెంచుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలు ప్రకంపనలు రేపుతున్నాయి. రష్యా, చైనాలను లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన ఈ హెచ్చరికలపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గెంగ్ స్పందించారు. అమెరికాను బెదిరిస్తూనే...ఉత్తరకొరియాతో బంధాన్ని వదులుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఉత్తరకొరియాతో ఎన్నో ఏళ్లుగా తాము వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్నామని...ఇంకా చెప్పాలంటే తమ రెండు దేశాలు ఒకదేశంపై మరో దేశం ఆధారపడి ఉన్నాయని తెలిపారు.

ఉత్తరకొరియాతో వ్యాపారం చేసే ఎన్నో దేశాలతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఉత్తరకొరియా బాలిస్టిక్ మిస్సైల్స్ ప్రయోగిస్తోందన్న కారణంతో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మంచిది కాదని అన్నారు. చైనాతో నెలకు 40 బిలియన్ డాలర్ల (604 కోట్ల 80.7 లక్షల రూపాయల) వ్యాపారం చేసే అమెరికాయే ఆలోచించుకోవాలని గెంగ్ స్పష్టం చేశారు. అమెరికా కేవలం తమ దేశం నుంచే కాకుండా ఎన్నో దేశాల ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటోందని గెంగ్ గుర్తుచేశారు. అన్నింటికీ ఇతరులపై ఆధారపడే అమెరికా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదని ఎద్దేవా చేశారు. అసలు సమస్యను పక్కన పెట్టి...ట్రంప్ మరో కొత్త సమస్యను కొనితెచ్చుకుంటున్నారని గెంగ్ విమర్శించారు. అయితే అమెరికా తీసుకున్న నిర్ణయం అమలు చేస్తే, తమ వ్యాపారులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని గెంగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ట్రంప్ ఆలోచన అని, అమెరికా అధికారిక నిర్ణయం కాదని చైనా సర్దిచెప్పుకుంటోంది. 

  • Loading...

More Telugu News