: భారీగా తగ్గనున్న దుర్గగుడి టిక్కెట్ ధరలు!
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ గుడి అంతరాలయంలో టిక్కెట్ ధరలు బాగా తగ్గనున్నాయి. ఈ మేరకు పాలకమండలి ఓ తీర్మానం చేసింది. రూ.300 టిక్కెట్ ధరను రూ.150 కు..రూ.100 టిక్కెట్ ధరను రూ.50కు తగ్గిస్తూ దుర్గగుడి పాలక మండలి తీర్మానం చేసింది. మాడపాటి వసతి గృహంలో ఈ రోజు నిర్వహించిన పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
దసరా నవరాత్రులు జరగనున్న నేపథ్యంలో జరుగుతున్న ఏర్పాట్లు, అభివృద్ధి పనులు, త్వరలో ప్రారంభించనున్న కొత్త పూజలు మొదలైన అంశాల గురించి చర్చించినట్టు ఆలయ చైర్మన్ గౌరంగబాబు తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే తగ్గించిన టిక్కెట్ ధరలు అమల్లోకి వస్తాయని అన్నారు. ఈ సందర్భంగా దుర్గగుడి ఈవో సూర్యకుమారి మాట్లాడుతూ, దసరా ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు. దసరా ఉత్సవాల సమయంలో భక్తులను ఘాట్ రోడ్డు ద్వారానే అనుమతిస్తామని అన్నారు.