: రోడ్డు మీది గుంతలను ఫొటో తీయండి... క్యాష్ ప్రైజ్ గెలవండి
మీరు ప్రయాణిస్తున్న దారిలో గుంతలు ఉన్నాయా? వర్షాల కారణంగా మీ కాలనీలో మురికి గుంతలు ఏర్పడ్డాయా? అయితే వాటిని వెంటనే ఫొటో తీసి hydpothole@gmail.comకి మెయిల్ చేయండి. మీరు పంపిన ఫొటో బాగుంటే రూ. 5000 బహుమతిగా గెల్చుకునే అవకాశాన్ని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి మర్రి ఆదిత్య రెడ్డి కల్పించారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో ఎక్కడ మురికి గుంతలు కనిపించినా ఫొటో తీసి పంపాలని, ఉత్తమంగా ఉన్న ఫొటోలకు మొదటి బహుమతిగా రూ. 5000, రెండో బహుమతిగా రూ. 2500 ఇస్తానని ఆయన ప్రకటించారు. సెప్టెంబర్ 10లోగా ఫొటోలు తమకు అందేలా పంపించాలని ఆయన కోరారు. దీనికి, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని, ప్రజల్లో అవగాహన కోసమే ఈ పోటీ నిర్వహిస్తున్నట్లు మర్రి ఆదిత్య రెడ్డి పేర్కొన్నారు. పొటీ గురించి సోషల్ మీడియాలో ప్రకటించిన 24 గంటల్లోపే 50కి పైగా ఫొటోలు వచ్చినట్లు ఆయన తెలియజేశారు.