: ‘అర్జున్‌రెడ్డి’ పోస్టర్లను చింపేసిన మహిళలు.. రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరిక
‘అర్జున్ రెడ్డి’ సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలపై మహిళల పోరాటం కొనసాగుతోంది. విజయనగరం జిల్లాలోని ఎస్.కోట వెంకటేశ్వర డీలక్స్ థియేటర్ వద్ద 'ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య' ఆధ్వర్యంలో మహిళలు ఆ సినిమా పోస్టర్లను చించేశారు. దీంతో ఆ థియేటర్ సిబ్బంది మహిళలతో వాగ్వివాదానికి దిగారు. ఈ సినిమా మహిళలు, విద్యార్థులను కించపరిచేలా ఉందని, వెంటనే నిషేధించాలని డిమాండ్ చేశారు.
ఈ సినిమా హీరో విజయ్ దేవరకొండకు మహిళలంటే గౌరవం లేదని మండిపడ్డారు. ఈ సినిమాలో అశ్లీల దృశ్యాలు ఉన్నాయని అన్నారు. దీనిపై సర్కారు స్పందించి ఈ సినిమాను నిషేధించాలని డిమాండ్ చేశారు. ఈ సినిమాను ఇలాగే ప్రదర్శిస్తే తాము రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని తేల్చి చెప్పారు.