: జీర్ణక్రియ సమస్యతో మరణించిన మహిళ.... డాక్టర్లు కడుపులో మర్చిపోయిన కత్తెరే కారణమంటున్న బంధువులు!
గుజరాత్‌లోని కచ్ ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల మహిళ పెద్దపేగులో ఇన్‌ఫెక్షన్ రావడంతో జీర్ణక్రియ సమస్యలు ఏర్పడి మరణించింది. ఐదేళ్ల క్రితం ఆమెకు ఆపరేషన్ చేసిన డాక్టర్లు మహిళ కడుపులో ఫోర్సెప్స్ (ఆపరేషన్ సమయంలో శరీర భాగాలను విడదీసేందుకు ఉపయోగించే కత్తెర) మర్చిపోవడమే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. 2012లో కడుపులో వ్రణం ఏర్పడటంతో జివిబెన్ చావ్డాను అసర్వాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడి డాక్టర్లు ఆమెకు ఆపరేషన్ చేసి వ్రణం తీసేశారు.
అయితే, ఇటీవల తనకు తరచు కడుపునొప్పి వస్తోందని మళ్లీ ఆసుపత్రికి వెళ్లింది జివిబెన్. ఎక్స్‌రే తీసి చూడగా ఆమె కడుపులో ఫోర్సెప్స్ కనిపించింది. దీంతో వెంటనే ఆమెకు ఆపరేషన్ చేసి కడుపులో నుంచి ఫోర్సెప్స్‌ను బయటకు తీశారు. అయినప్పటికీ కడుపునొప్పి తగ్గక ఇవాళ ఉదయం జివిబెన్ మరణించింది. 4 ఏళ్ల పాటు ఫోర్సెప్స్ కడుపులో ఉండటంతో కడుపులో ఇన్‌ఫెక్షన్ తీవ్రంగా మారి, దాని వల్ల ఆమె చనిపోయిందని ఆపరేషన్ చేసిన డాక్టర్లపై జివిబెన్ బంధువులు కేసు పెట్టారు. అయితే ఆమె మరణానికి పూర్తి కారణం ఫోర్సెప్స్ మర్చిపోవడం కాదని, కడుపునొప్పిని నిర్లక్ష్యం చేయడం, సరైన పోషకాహారం తీసుకోకపోవడం కూడా అని డాక్టర్లు చెబుతున్నారు.