: మహిళను కామెంట్ చేసిన వ్యక్తికి రూపాయి జరిమానా విధించిన జడ్జి!
పొరిగింటి మహిళను 'చమ్మక్ చల్లో' అంటూ కామెంట్ చేసిన వ్యక్తికి థానేలోని ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఒక్క రూపాయి జరిమానాతో పాటు ఒక రోజు కోర్టు ముగిసే వరకు నిలబడి వుండాలని సాధారణ శిక్షను విధించింది. వివరాల్లోకి వెళ్తే, థానే సిటీలోని గోడ్ బందర్ రోడ్డు ప్రాంతంలో ఓ మహిళ తన భర్తతో కలసి ఉదయం వాకింగ్ కు వెళ్లి, ఇంటికి తిరిగి వస్తుండగా... పొరుగింటి వ్యక్తి చెత్త కుండీని కాళ్లతో పడేయడంతో పాటు, చమ్మక్ చల్లో అంటూ కామెంట్ చేశాడు.
దీంతో, ఆమె హౌసింగ్ సొసైటీకి ఫిర్యాదు చేసింది. అయినా సొసైటీ ఎలాంటి చర్య తీసుకోకపోవడంతో, ఆమె పోలీసులను ఆశ్రయించారు. దీంతో, పోలీసులు సదరు వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ 509 కింద కేసు నమోదు చేసి, కోర్టులో ప్రవేశపెట్టారు. కేసును విచారించిన జడ్జి ఇంగాలే అతనికి ఒక్క రూపాయి జరిమానాతో పాటు, ఒక్క రోజు సాధారణ శిక్షను విధించారు.