: మోదీ కేబినెట్‌లో ఏడుగురు ఆర్మీ మాజీ అధికారులు, బ్యూరోక్రాట్లు.. 2019 ఎన్నికల వ్యూహమేనా?
ప్రధాని నరేంద్రమోదీ కొత్త కేబినెట్‌లో పదిశాతం మంది బ్యూరోక్రాట్లు, మాజీ ఆర్మీ అధికారులకు చోటు లభించింది. మాజీ హోం కార్యదర్శి, రిటైర్డ్ దౌత్యవేత్త, ముంబై మాజీ పోలీస్ కమిషనర్, మాజీ ఆర్మీచీఫ్‌లు మంత్రి పదవులు దక్కించుకున్న వారిలో ఉన్నారు. కేబినెట్ తాజా కూర్పు చూస్తుంటే 2019 ఎన్నికల వ్యూహంలా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
మోదీ కేబినెట్‌లో చోటు దక్కించుకున్న వారిలో మాజీ బ్యూరోక్రాట్లు రాజ్‌కుమార్ సింగ్, హర్దీప్ పూరీ, సత్యపాల్ సింగ్, అల్ఫోన్స్ కన్నన్‌థానమ్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ తర్వాత మంత్రుల సంఖ్య 76కు చేరుకుంది. పూరీ, అల్ఫోన్స్‌లు రాజ్యసభకు ఎన్నికవ్వాలి, లేదంటే ఆరు నెలల్లోపు ఎన్నికల్లో గెలవాల్సి ఉంటుంది. ఇక కేబినెట్‌లో చోటు దక్కించుకున్న మాజీ ఆర్మీ అధికారుల్లో ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్, రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ ఉన్నారు.