: ఆమె జయలలిత, శోభన్ బాబు కుమార్తేనా? లేక, ఆస్తులు దక్కించుకునేందుకు శశికళ ప్రయోగించిన అస్త్రమా?: కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి


తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత, తెలుగు నటుడు శోభన్ బాబులకు తాను పుట్టానని, కావాలంటే డీఎన్ఎ పరీక్షకు కూడా సిద్ధమని చెబుతున్న అమృతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెన్నయ్ లోని తెలుగు యువశక్తి అధ్యక్షుడు, తెలుగు భాషా పరిరక్షణ వేదిక కన్వీనర్‌ కేతిరెడ్డి జగదీశ్వర్‌ రెడ్డి అన్నారు. చెన్నైలో ఆయన మాట్లాడుతూ, జయలలిత కుమార్తెనని, ఆమె ఆస్తులకు సిసలైన వారసురాలినని చెబుతున్న అమృత.. శోభన్ బాబు ఆస్తులను ఎందుకు కోరడం లేదని సూటిగా ప్రశ్నించారు.

జయలలిత మరణానంతరం చోటుచేసుకుంటున్న పరిణామాలపై రాష్ట్ర ప్రజలు, ఆమె అభిమానులు తీవ్ర గందరగోళంలో ఉన్నారని ఆయన అన్నారు. జయలలిత వారసులమంటూ కొత్తగా పుట్టుకొస్తున్న వారి ప్రకటనలు పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇలా బయటకు వస్తున్న వాళ్లంతా.. తాము జయలలిత, శోభన్ బాబుల సంతానం అన్న విషయాన్ని తమకు బంధువులు చెప్పారని చెబుతున్నారని గుర్తుచేశారు. అదీ కాకుండా వీరంతా కేవలం జయలలిత వారసత్వం మాత్రమే కోరుతున్నారని ఆయన పేర్కొన్నారు. వారి మాటలను బట్టి వారంతా శోభన్ బాబు బిడ్డలైనా ఆయన ఆస్తులను ఎందుకు కోరడం లేదని జగదీశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.

తాజాగా బెంగళూరు నుంచి వచ్చిన అమృత వెనక ఉన్న అదృశ్యశక్తులను బయటకు తీయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. అధికారం కోసం 2012లో జయలలితపై విషప్రయోగానికి ప్రయత్నించిన శశికళే అమృత పాత్రను బయటకు తీసుకొచ్చినట్టు అనిపిస్తోందని ఆయన అన్నారు. ఈ అమృత వెనుక మన్నార్ గుడి మాఫియా ఉందా? అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. జయలలిత ఆస్తిపాస్తులను కాపాడుకునేందుకు శశికళ లేక జయలలిత మేనకోడలు, మేనల్లుడు పన్నిన పన్నాగంలో అమృత పాత్ర ఉందా? లేదా? అన్నది నిగ్గుతేల్చేందుకు సీబీఐ దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అమృత చెబుతున్న మాటలకు పొంతన కుదరడం లేదని ఆయన చెప్పారు.  

జయలలిత ఆస్తులను సొంతం చేసుకునేందుకు శశికళ పన్నాగం పన్నిందన్న ఆరోపణలు తమిళనాడు ప్రజలు, అభిమానుల్లో ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో సీబీఐ విచారణ చేయించి, నిజానిజాలు వెలికి తీయాల్సిన అవసరం ఎంతో ఉందని ఆయన తెలిపారు. దీనిపై ఇదివరకే తాను సుప్రీంకోర్టును ఆశ్రయించానని, అయితే కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే సదరు కేసు దాఖలు చేయవల్సిందిగా సర్వోన్నత న్యాయస్థానం సూచించిందని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు దీనిపై ఆమె కుటుంబ సభ్యులెవరైనా సుప్రీంకోర్టులో వ్యాజ్యం వేస్తే వారికి తనవంతు సహకారం అందిస్తానని ఆయన భరోసా ఇస్తున్నారు.

  • Loading...

More Telugu News