: హైడ్రోజన్ బాంబును తయారుచేశాం... అమెరికాను బెంబేలెత్తించే ప్రకటన చేసిన కిమ్ జాంగ్ ఉన్!
ఉత్తరకొరియాపై సైనిక చర్యకు దిగుతామంటూ హెచ్చరిస్తున్న అమెరికాను ఆందోళనలకు గురిచేసే ప్రకటనను ఆ దేశం చేసింది. అత్యంత శక్తిమంతమైన హైడ్రోజన్ బాంబును అభివృద్ధి చేశామని ప్రకటించింది. జపాన్ మీదుగా ప్రయాణించి, ఫసిఫిక్ తీర దిశగా ప్రయోగించిన ఖండాంతర క్షిపణి (ఐసీబీఎం) హస్వాంగ్-14 కు అమర్చేందుకు వీలుగా దీనిని తయారు చేశామని ఉత్తరకొరియా తెలిపింది. ఈ (ఐసీబీఎంకి హైడ్రోజన్ బాంబును అమర్చే) ప్రయోగానికి కిమ్ జాంగ్ ఉన్ ఎప్పుడో ఆదేశాలు జారీ చేశారని ఈ ప్రకటన వెల్లడించింది. దీంతో హైడ్రోజన్ బాంబును ఎంత మోతాదులో కావాలంటే అంత మోతాదు (10 టన్నుల నుంచి 100 టన్నుల వరకూ) లో క్షిపణికి అమర్చి ప్రయోగించొచ్చని స్పష్టం చేసింది.
దీనిని ఇతర బాంబుల కంటే అత్యధిక ఎత్తులో పేల్చవచ్చని, తద్వారా సంభవించే నష్టం కనీవినీ ఎరుగని రీతిలో ఉంటుందని ఆ ప్రకటన వెల్లడించింది. ఈ హైడ్రోజన్ బాంబు తయారీలో ఉపయోగించిన గుండుసూది కూడా ఉత్తరకొరియా దేశీయంగా అభివృద్ధి చేసిందేనని స్పష్టం చేసింది. దీంతో ఎన్ని కావాలంటే అన్ని హైడ్రోజన్ బాంబులను తయారు చేసుకోవచ్చని తెలిపింది. దీనిని కిమ్ జోంగ్ ఉన్ తాతయ్య కిమ్ 2 సంగ్ ఏర్పాటు చేసిన జూచే బేసిస్ లో దేశీయ టెక్నాలజీతో అభివృద్ధి చేసినట్టు తెలిపింది. ఈ మేరకు ఇన్ స్టాలేషన్ కు సిద్ధంగా ఉన్న హైడ్రోజన్ బాంబును కిమ్ జాంగ్ ఉన్ పరిశీలించారని తెలిపింది. కాగా, దక్షిణ కొరియా, జపాన్, అమెరికాలతో ఉత్తరకొరియాకు శత్రుత్వం ఉంది. తాజా ప్రకటన నేపథ్యంలో ఈ మూడు దేశాల్లో ఆందోళన వ్యక్తమయ్యే అవకాశం ఉంది. తాజా ప్రకటనపై ఆ దేశాలు స్పందించే అవకాశం ఉంది.