: విజయనగరం జిల్లాలో బాలికపై సామూహిక అత్యాచారం, హత్య!
భోజనానికి ఇంటికి వెళ్లి, పాఠశాలకు తిరిగి వెళ్తున్న పదో తరగతి బాలికపై సామూహిక అత్యాచారానికి తెగబడి, హత్య చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గాదెలవలసలో చోటుచేసుకుంది. మండలంలోని రెడ్డియ్యవలస గ్రామానికి చెందిన మిరియాల ఇందు (15) సీతానగరం మండలంలోని గాదెలవలసలో 10వ తరగతి చదువుతోంది. పాఠశాలకు వచ్చిన ఆమె మధ్యాహ్నం భోజనం కోసం సైకిల్ పై ఇంటికివెళ్లింది. తిరిగి పాఠశాలకు వస్తుండగా మార్గమధ్యంలో గాదెలవలసకు చెందిన పోతల శంకరరావు తన మిత్రులు సొంగల లోకేశ్, చుక్క రాంబాబు, కోదేటి రవితేజలతో కలసి.. ఆమెను అడ్డగించి, భయపెట్టి, దగ్గర్లోని మామిడితోటలోకి ఈడ్చుకెళ్లాడు.
అక్కడ వీరంతా కలసి బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. తరువాత ఈ దారుణాన్ని అందరికీ చెబుతుందన్న ఆందోళనతో ఆమె గొంతు నులిమి హతమార్చి, దగ్గర్లోని చెరువులో పడేశారు. చీకటి పడుతున్నా కుమార్తె ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన ఆమె తల్లిదండ్రులు శ్రీనివాసరావు, సత్యవతి గాదెలవలస వచ్చి విచారించారు. దీంతో ఇందును శంకరరావు బెదిరిస్తుండగా చూసిన పి.అచ్యుత్, మధ్యాహ్నం తాను చూసిన విషయాలను వారికి వివరించాడు.
వెంటనే గ్రామ పెద్దలతో కలిసి వెళ్లిన ఇందు తల్లిదండ్రులు శంకర్రావును గట్టిగా నిలదీయడంతో, ఆమెపై సామూహిక అత్యాచారం చేసి, హతమార్చినట్టు అంగీకరించాడు. దీంతో పోలీసులకు సమాచారమందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు, వారిని అదుపులోకి తీసుకున్నారు. చెరువులోంచి ఇందు మృతదేహాన్ని బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం బొబ్బిలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.