: సినీ ఫక్కీ పరారీ... పాయింట్ బ్లాంక్ రేంజ్ లో తుపాకీ గురిపెట్టి... గ్యాంగ్ స్టర్ ను విడిపించుకునిపోయిన వైనం!
సినీ ఫక్కీలో కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ ను దుండగులు తప్పించిన ఘటన పంజాబ్ లో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... అమృత్ సర్ లో శుభమ్ అనే వ్యక్తి హత్య, హత్యాయత్నం, దోపిడి కేసుల్లో ప్రధాన నిందితుడు. రిమాండ్ ఖైదీగా వున్న ఆయనను హత్య కేసు విచారణ నిమిత్తం కపుర్తల జిల్లా నుంచి అమృత్ సర్ కోర్టుకు పోలీసులు తరలిస్తుండగా, మార్గ మధ్యంలో రయ్యా టౌన్ వద్ద ఏడుగురు గుర్తుతెలియని వ్యక్తులు పోలీస్ బస్ ను అడ్డగించారు.
భద్రతా సిబ్బందిలో ఒకరిని పట్టుకుని అతనికి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో తుపాకీ గురిపెట్టి శుభమ్ ను విడిపించుకున్నారు. అయితే అక్కడే ఉన్న అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ సుఖ్జీందర్ సింగ్ వారిపై కాల్పులు జరిపే ప్రయత్నం చేయగా, దుండగులు అతనిపై కాల్పులు జరిపారు. దీంతో ఆయన గాయపడ్డారు. 12కు పైగా కేసులను ఎదుర్కుంటున్న శుభమ్ తప్పించుకుని పోవడంపై విచారణ ప్రారంభించారు.