: యూనివర్సిటీ అధికారుల తప్పిదం.. కోటీశ్వరురాలైన విద్యార్థిని!
యూనివర్సిటీ అధికారుల తప్పిదం ఓ విద్యార్థినిని కోటీశ్వరురాలిని చేసింది. కోట్ల రూపాయలు చేతిలో ఉండడంతో ఆమె కొంచెం కూడా ఆలస్యం చేయకుండా షాపింగ్‌కు బయలుదేరింది. నచ్చిన వస్తువులు కొనుక్కొని ముచ్చటపడిపోయింది. దక్షిణాఫ్రికాలో జరిగిందీ ఘటన. తూర్పు కేప్‌లోని వాల్టర్ సిసులు యూనివర్సిటీలో ఓ యువతి చదువుకుంటోంది. మెస్ ఖర్చుల నిమిత్తం యూనివర్సిటీ అధికారులు ఆమెకు నెలకు 1400 ర్యాండ్‌లు (రూ.6800) అందజేస్తున్నారు.
అయితే జూన్‌లో అధికారులు పొరపాటున 1400 ర్యాండ్‌లకు బదులు 1400 మిలియన్ ర్యాండ్‌లు (దాదాపు రూ.7 కోట్లు) ఆమె ఖాతాలోకి పంపారు. ఇంకేముంది.. ఖాతాలో కోట్లు కనిపించగానే విద్యార్థిని షాపింగ్‌కు బయలుదేరింది. ఫోన్, బట్టలు.. ఇలా ఏకంగా రూ.39 లక్షలు ఖర్చు చేసింది. ఆలస్యంగా తప్పు తెలుసుకున్న యూనివర్సిటీ అధికారులు ఆమె ఖాతానుంచి డబ్బులు వెనక్కి తీసుకున్నారు. మిగతా సొమ్మును కూడా ఆమె చెల్లించాల్సి ఉంటుందని అంటున్నారు. దీంతో ఇప్పుడామె దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.