: ఇక కదలండి.. చంద్రబాబుకి దిమ్మతిరిగి పోవాలి: జగన్ పిలుపు
కోటి కొత్త కుటుంబాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో చేర్చాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తమ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ రోజు పులివెందులలో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నంద్యాలలో ఇష్టానుసారంగా డబ్బులు పంచారు కాబట్టే ఉప ఎన్నికల్లో గెలిచారని ఆరోపించారు. చంద్రబాబు రైతులకు అన్యాయం చేసినా, ఉద్యోగాలు ఇవ్వకపోయినా, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయకపోయినా టీడీపీ అభ్యర్థికి ఓట్లు పడ్డాయంటే అందుకు కారణం ప్రజలను టీడీపీ బెదిరించడమేనని అన్నారు.
అధికారంలో ఉన్న టీడీపీకి ఓట్లు వేయకపోతే తమకు పింఛన్ రాదేమోనని భయపడి ఓటర్లు ఆ పార్టీకి ఓట్లు వేశారని జగన్ అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక నవరత్నాలను అమలు చేసి అందరి కష్టాలను తీర్చుతామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 11 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరినీ వైసీపీలో చేర్చాలని జగన్ పిలుపునిచ్చారు. అనంతరం 6 నెలల పాటు పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు. తనకు రాష్ట్ర ప్రజల దీవెనలు కావాలని చెప్పారు. ప్రతి వైసీపీ కార్యకర్త ఒక్కటి కావాలని అన్నారు. చంద్రబాబు నాయుడికి దిమ్మతిరిగి పోవాలని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నైజాన్ని బయటపెట్టాలని అన్నారు.