: వైసీపీ ఎమ్మెల్యే చింతల లాంటి వారు మా పార్టీకి అవసరం లేదు: చిత్తూరు టీడీపీ నేతలు
కొన ఊపిరి ఉన్నంత వరకు వైసీపీలోనే కొనసాగుతానని, టీడీపీలోకి చేరే ప్రసక్తే లేదని చిత్తూరు జిల్లా పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు మండిపడ్డారు. అసలు ఆయనను టీడీపీలోకి రావాలని ఎవరు పిలిచారంటూ ఎద్దేవా చేశారు.
చింతలలాంటి అభివృద్ధి నిరోధకులు టీడీపీకి అవసరం లేదని చెప్పారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాలతో జగన్, రోజాలకు మతి భ్రమించిందని... వారిలాగే చింతలకు కూడా మతి భ్రమించిందని అన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిలతో కలసి చింతల నెల రోజులపాటు నంద్యాలలోనే మకాం వేశారని... అయినా, సాధించింది ఏమీ లేదని దెప్పి పొడిచారు. చింతల చవకబారు కామెంట్లను మానుకోవాలని... వచ్చే ఎన్నికల్లో చింతల ఏ పార్టీ తరపున పోటీ చేసినా, ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు.