: పోలవరం ప్రాజెక్టుని 2019లోపు పూర్తి చేయాలి: వాటర్ రీసోర్సెస్ స్టాండింగ్ కమిటీకి కేవీపీ రామచంద్రరావు లేఖ
ఆంధ్రప్రదేశ్, పంజాబ్, చత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్‌లలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన భారీ నీటి పారుదల ప్రాజెక్టులను స్వయంగా పరిశీలించి, అన్ని విషయాలను తనిఖీ చేయాలని కేంద్ర వాటర్ రీసోర్సెస్ స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. అనంతరం ఆ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. ఈ నేపథ్యంలో ఆ కమిటీ ఛైర్మన్, బీజేపీ ఎంపీ హుకుమ్ సింగ్ కు కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఓ లేఖ రాసి కృతజ్ఞతలు తెలిపారు. వాటర్ రీసోర్సెస్ స్టాండింగ్ కమిటీ చేయనున్న ఈ తనిఖీపై ముఖ్యంగా ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.
పోలవరం ప్రాజెక్టు పనులు ఎలా కొనసాగుతున్నాయన్న అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి సదరు కమిటీ సమగ్ర వివరాల్ని అందిస్తుందని తాను ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీకి పోలవరం ప్రాజెక్టు ఎంతో ముఖ్యమని, ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కావలసిన నిధులను కేంద్ర ప్రభుత్వం ఆలస్యం కాకుండా మంజూరు చేస్తుందని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుని మార్చి, 2019 లోపు పూర్తి చేయాలని ఆయన కోరారు.