: బక్రీద్ రోజు ఆత్మీయ ఆలింగనాలు వద్దు... స్వైన్ ఫ్లూ వ్యాప్తి భయంతో ముస్లిం మతపెద్దల సూచన
బక్రీద్ పండుగ సందర్భంగా ప్రార్థనల తర్వాత ఆత్మీయ ఆలింగనాలు, కరచాలనాలకు దూరంగా ఉండాలని ఉత్తర ప్రదేశ్ ముస్లింలకు మత పెద్దలు సూచించారు. రాష్ట్రంలో రోజురోజుకీ పెరుగుతున్న హెచ్1ఎన్1 స్వైన్ ఫ్లూ వ్యాప్తిని కట్టడి చేయడానికి వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఉన్న 75 జిల్లాల్లో 66 జిల్లాల్లో ఇప్పటికే 2,300 మంది స్వైన్ ఫ్లూ బారిన పడినట్లు సమాచారం. వారిలో 53 మంది వరకు మరణించినట్లు రికార్డులు చెబుతున్నాయి. యూపీలో ఇంత మొత్తంలో స్వైన్ ఫ్లూ వ్యాపించడం ఇదే మొదటిసారి.
`ఈ ఒక్క ఏడాది సంప్రదాయ ఆలింగనాలను వదిలేయాలని ముస్లింలను మేం కోరుతున్నాం` అని సున్నీ మతపెద్ద మౌలానా ఖలీద్ రషీద్ ఫిరంగి మహాలీ మీడియాతో అన్నారు. యూపీ జనాభాలో 4 కోట్ల మంది ముస్లింలు ఉన్న కారణంగా ఆత్మీయ ఆలింగనాలు, కరచాలనాల వల్ల స్వైన్ ఫ్లూ విజృంభించే అవకాశాలు ఉన్నాయని, అందుకే వాటికి దూరంగా ఉండాలని సూచించినట్లు ఆయన తెలిపారు. పండుగ సందర్భంగా పాటించే సంప్రదాయాల వల్ల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడటం అనేది ముస్లిం మత విధానాలకు సిగ్గు చేటు కలిగించే అవకాశాలు ఉన్నాయని మౌలానా పేర్కొన్నారు.