: భారత్‌కి అమెరికా రాయబారిగా కెన్నెత్ జెస్టర్... నామినేట్ చేసిన ట్రంప్
ప్రముఖ ఆర్థిక నిపుణుడు కెన్నెత్ జెస్టర్‌ను భారత దేశానికి అమెరికా రాయబారిగా నామినేట్ చేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కెన్నెత్ జెస్టర్ నామినేషన్ గురించి గత జూన్‌లోనే వైట్ హౌస్ అధికారికంగా ప్రకటించింది. అంతర్గత ఆర్థిక వ్యవహారాల్లో అధ్యక్షుడికి డిప్యూటీ సహాయకుడిగా కెన్నెత్ పనిచేస్తున్నారు. అలాగే అమెరికా నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డిప్యూటీ డైరెక్టర్‌గా కూడా కెన్నెత్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ట్రంప్ నామినేషన్‌ను ఖరారు చేస్తూ అమెరికా సెనేట్ నిర్ణయిస్తే ప్రస్తుతం భారత్‌కి ఆపద్ధర్మ అమెరికా రాయబారిగా ఉన్న మేరీకే ఎల్. కార్ల్‌సన్ స్థానంలో కెన్నెత్ నియమితులవుతారు. ఇంతకు ముందు ఈ పదవిలో పనిచేసిన రిచర్డ్ వర్మ జనవరి 20, 2017న రాజీనామా చేసినప్పటి నుంచి ఈ స్థానం ఖాళీగా ఉంది. ఈ పదవీ బాధ్యతలు నిర్వహించిన మొదటి భారత అమెరికన్‌గా రిచర్డ్ వర్మ నిలిచారు. ఈయనను మాజీ అధ్యక్షుడు ఒబామా నియమించారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక రిచర్డ్ రాయబారి పదవి నుంచి తప్పుకున్నారు.