: నల్ల జాతీయులను మాత్రమే చంపుతాం: కెమెరాలో రికార్డైన అమెరికా పోలీస్ అధికారి మాటలు
కేవలం నల్లజాతీయులను మాత్రమే చంపుతామంటూ అమెరికాలోని జార్జియా పోలీస్ అధికారి లెఫ్టినెంట్ గ్రెగ్ అబాట్ చేసిన వ్యాఖ్యలు కెమెరాలో రికార్డు కావడం, అవి బయటకు పొక్కడంతో కలకలం రేగింది. ఈ నేపథ్యంలో వెంటనే రాజీనామా చేయాలని, లేకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తామని ఉన్నతాధికారులు ఆయనకు వార్నింగ్ ఇచ్చారు. దీంతో, ఆయన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. 30 ఏళ్లపాటు విధులను నిర్వహించిన అబాట్... తాను చేసిన చర్యలతో రిటైర్ మెంట్ బెనెఫిట్స్ కూడా కోల్పోయే ప్రమాదం ఉంది.
ఘటన వివరాల్లోకి వెళ్తే, జూలై 2016లో ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ కారు ఆగి ఉంది. ఆ కారులో ఉన్న మహిళతో సదరు పోలీస్ అధికారి మాట్లాడుతున్నాడు. 'నీవు నల్ల జాతీయురాలివి కాదు. గుర్తుంచుకో. మేము కేవలం నల్ల జాతీయులనే చంపుతాం' అని ఆయన సదరు మహిళతో అన్నాడు. ఈ విషయాన్ని ఆ కారు వెనకే ఉన్న మరో కారులోని కెమెరా రికార్డు చేసింది. ఈ ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ విషయంపై సీరియస్ అయ్యారు. ఇది చాలా దారుణమైన ప్రవర్తన అని వారు అన్నారు.