: సైబర్ దాడులకు కారణం సోషల్ మీడియానే: ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ బీపీ కనుంగో
వ్యక్తిగత వివరాలు హ్యాకర్ల చేతికి చిక్కడానికి సోషల్ మీడియా మాధ్యమంగా పనిచేస్తోందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ బీపీ కనుంగో అన్నారు. `సైబర్ దాడికి కావాల్సిన అన్ని రకాల వివరాలను సోషల్ మీడియా అందిస్తుంది. ఈ వివరాల కారణంగా యూజర్‌ను సులభంగా మోసం చేసే అవకాశం దొరుకుతోంది` అని కనుంగో చెప్పారు. హైదరాబాద్‌లో జరిగిన ఇనిస్టిట్యూట్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ రీసెర్చి బ్యాంకింగ్ వారి అవార్డుల వేడుకకు ఆయన హాజరుకావాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోవడంతో సందేశాన్ని పంపించారు.
వేడుకలో ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గణేశ్ కుమార్.. ఆయన పంపిన సందేశాన్ని చదివారు. సోషల్ మీడియాలో పొందుపరిచిన వివరాల కారణంగా రోజురోజుకీ బ్యాంకింగ్ మోసాల సంఖ్య పెరుగుతోందని, ఐటీ ఆధారిత బ్యాంకింగ్‌లో వీటిపై జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందని కనుంగో తన సందేశంలో పేర్కొన్నారు. సైబర్ సెక్యూరిటీని మెరుగుపరిచి, ఖాతాదారులకు పారదర్శకమైన బ్యాంకింగ్ సేవలు అందజేయాలని ఆయన సూచించారు.