: గాళ్ ఫ్రెండ్‌ను మనుషుల అక్రమ రవాణా ముఠాకు అమ్మేసిన యువకుడు!
ప్రేమ పేరుతో 16 ఏళ్ల బాలికను వంచించిన యువకుడు ఆమెను మనుషుల అక్రమ రవాణా ముఠాకు అమ్మేశాడు. ముంబైలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. ముంబైలోని గోవండికి చెందిన 19 ఏళ్ల కరణ్ పవార్ 16 ఏళ్ల బాలికను ప్రేమ పేరుతో దగ్గర చేసుకున్నాడు. అనంతరం నాసిక్‌లో మ్యారేజ్ బ్యూరో ముసుగులో మనుషుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఓ ముఠాకు ఆమెను విక్రయించాడు. వారు అహ్మదాబాద్‌కు చెందిన 23 ఏళ్ల డ్రైవర్‌కు రూ.75 వేలకు అమ్మేసి అతడికిచ్చి బలవంతంగా పెళ్లి చేశారు.
ప్రియుడి మోసాన్ని గ్రహించిన బాలిక తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు పవార్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాలికతో అతడికి ఏడాదిన్నరగా పరిచయం ఉందని, రెండు వారాల క్రితం ఉద్యోగం ఇప్పిస్తానని నాసిక్ తీసుకెళ్లి ముఠాలో కీలక వ్యక్తి అయిన రాణి అనే మహిళకు అమ్మేసి తిరిగి ముంబై చేరుకున్నట్టు పోలీసులు తెలిపారు. యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.