: దేవుడు నాకు జగమంత కుటుంబాన్ని ఇచ్చాడు: పవన్ కల్యాణ్
దేవుడు తనకు జగమంత కుటుంబాన్ని ఇచ్చాడని జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా వస్తున్న అభినందనల నేపథ్యంలో పవన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. ‘ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నాను. మీరు నాపై చూపిస్తున్న ప్రేమ, మద్దతు, దయ ఇలాగే కొనసాగాలి. నేను పుట్టినరోజు వేడుకను జరుపుకోను. కానీ, ఈ వేడుకను మీరందరూ జరుపుకుంటున్నారు... ‘నేను నిజంగా ఇంతటి ప్రేమకు అర్హుడినా?’ అని నేను అంతర్ముఖంగా ప్రశ్నించుకున్నాను. ఐదుగురు కుటుంబసభ్యులు ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన నన్ను, దేవుడు ఆశ్చర్యపరుస్తూ జగమంత కుటుంబాన్ని ఇచ్చాడు’ అని తన వరుస ట్వీట్లలో పవన్ పేర్కొన్నారు. కాగా, పవన్ కల్యాణ్ తన పుట్టినరోజు వేడుకలకు చాలా కాలంగా దూరంగా ఉంటున్నాడు. ఈ ఏడాది కూడా అదే పద్ధతిని పవన్ కొనసాగించడం గమనార్హం.