: పీఎస్ఎల్‌వీ-సీ39 రాకెట్ ప్రయోగం ఎందుకు విఫలమైందో తెలిసింది!


భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గురువారం ప్రయోగించిన పీఎస్ఎల్‌వీ-సీ39 రాకెట్ ప్రయోగం విఫలమవడానికి గల కారణాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఐఆర్ఎన్ఎస్ఎస్-1హెచ్ ఉపగ్రహాన్ని రాకెట్ నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టడంలో విఫలమైంది. ప్రయోగం విఫలం కావడంపై విశ్లేషించిన శాస్త్రవేత్తలు.. అధిక బరువే అందుకు కారణమని తేల్చారు. ఏకంగా టన్ను అధిక బరువే ప్రయోగం కొంప ముంచిందని పేర్కొన్నారు. అధిక బరువు వల్ల రాకెట్ గమన వేగం సెకనుకు కిలోమీటరు మేర తగ్గిపోయింది. ఫలితంగా రాకెట్ ఉష్ణకవచం వేరుపడలేదు. పీఎస్ఎల్‌వీ రాకెట్ విజయాశ్వమైనా బరువు కారణంగా ప్రయోగం విఫలమైందని శాస్త్రవేత్తలు తెలిపారు.

రాకెట్ డిజైన్ అనుమతించిన దానికంటే ఉపగ్రహం బరువు కనీసం టన్ను ఎక్కువగా ఉండడం వల్లే హీట్ షీల్డ్ (ఉష్ణకవచం) రాకెట్ నుంచి వేరు పడలేదని ఇస్రో శాటిలైట్ సెంటర్ డైరెక్టర్ ఎస్‌కే శివకుమార్ తెలిపారు. నిజానికి రాకెట్ సెకనుకు 9.5 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాల్సి ఉండగా అధిక బరువు దాని వేగాన్ని గణనీయంగా తగ్గించిందని, సెకనుకు కిలోమీటర్ తగ్గడం ద్వారా 8.5 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణించిందని వివరించారు. కాగా, గత 24 ఏళ్లలో పీఎస్ఎల్‌వీ విఫలం కావడం ఇదే తొలిసారని ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ తెలిపారు. భవిష్యత్ ప్రయోగాలపై దీని ప్రభావం ఎంతమాత్రమూ ఉండబోదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News