: హైదరాబాద్ లో నిమజ్జనం.. ట్రాఫిక్ ఆంక్షలు!
ఈ నెల 5న గణేశ్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు పోలీస్ కమిషనర్ శాండిల్య పేర్కొన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు. ఈ విషయాన్ని వాహనదారులు గమనించాలని కోరారు. బోయిన్ పల్లి, సికింద్రాబాద్, ఇతర కాలనీల నుంచి హన్మత్ పేట చెరువు వద్దకు వినాయక విగ్రహాలతో వచ్చే వాహనాలు.. అంజయ్యనగర్ మీదుగా ఇక్కడికి చేరుకోవాలని, నిమజ్జనం అనంతరం, ఓల్డ్ బోయిన్ పల్లి, మస్క్యూ రోడ్, హరిజన బస్తీ మీదుగా వెళ్లాలని సూచించారు.
అదే విధంగా, ఐడీఎల్ చెరువు వద్దకు నిమజ్జనం నిమిత్తం వచ్చే వాహనాలు గోద్రెజ్, జేఎన్టీయు మీదుగా ఐడీఎల్ జంక్షన్ చెరువు వద్దకు చేరుకోవాలని, ఆ తర్వాత రెయిన్ బో విస్టా, నైనా గార్డెన్ వైపునకు వెళ్లాలని సూచించారు. ఇక, బాలానగర్ - ఫతేనగర్ బ్రిడ్జి, గోద్రెజ్-ఎర్రగడ్డ, మియాపూర్-గోద్రెజ్, ఫిరోజ్ గూడ- గోద్రెజ్, గుడెంమెట్- నర్సాపూర్ క్రాస్ రోడ్ మార్గాల్లో భారీ వాహనాలను నిమజ్జనం రోజుల్లో అనుమతించమని చెప్పిన శాండిల్య, ఆరాంఘర్ క్రాస్ రోడ్ నుంచి బహదూర్ పుర మార్గంలో ఆర్టీసీ బస్సులకు కూడా అనుమతి లేదని తెలిపారు.