: యువకుడి ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ తక్షణ స్పందన.. 81 ఏళ్ల అవ్వకు పునర్జన్మ!
యువకుడి ట్వీట్‌కు స్పందించిన తెలంగాణ మంత్రి కేటీఆర్ దిక్కుమొక్కు లేకుండా రోడ్డుపై పడి ఉన్న ఓ వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించారు. ఏకంగా మంత్రే రంగంలోకి దిగడంతో వృద్ధురాలి కుటుంబ సభ్యులు స్పందించి ఆమెను ఇంటికి తీసుకెళ్లేందుకు ఆసుపత్రికి వచ్చారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
దిల్‌సుఖ్‌నగర్‌లో ఉంటూ పోటీ పరీక్షలకు శిక్షణ పొందుతున్న 21 ఏళ్ల నూరుద్దీన్ బక్రీద్ కోసం తన సొంత ఊరైన ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి వెళ్లేందుకు బస్టాండ్‌కు చేరుకున్నాడు. ఆ సమయంలో కోణార్క్ థియేటర్ వద్ద ఓ వృద్ధురాలు తీవ్ర గాయాలతో పడి ఉంది. ఆమెను చూసి హృదయం ద్రవించిన నూరుద్దీన్ వెంటనే ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశాడు.
స్పందించిన కేటీఆర్ వెంటనే సరూర్‌నగర్ డిప్యూటీ ప్రాజెక్ట్ అధికారి రంగారావుకు విషయం చేరవేశారు. ఆయన తన సిబ్బందితో కోణార్క్ థియేటర్ వద్దకు చేరుకుని గాయాలతో పడి ఉన్న వృద్ధురాలిని ఉస్మానియాకు తరలించారు. ఆమె పేరు సత్యమ్మ (81) అని, ఆమెకు వస్తున్న పింఛన్ డబ్బులను తీసుకుని సత్యమ్మను బయటకు వెళ్లగొట్టినట్టు ఆరోపణలున్నట్టు రంగారావు తెలిపారు.
సత్యమ్మ కుమార్తె జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేస్తున్నట్టు తేలిందన్నారు. విషయం తెలిసిన సత్యమ్మ కుమారుడు, కోడలు ఆసుపత్రికి చేరుకుని ఆమెను తిరిగి ఇంటికి తీసుకెళ్లేందుకు అంగీకరించారు. సత్యమ్మకు సీటీ స్కాన్ చేశామని, ఆమె చాలా బలహీనంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇక తన ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ స్పందించడంపై నూరుద్దీన్ హర్షం వ్యక్తం చేశాడు.