: సమాజం కోసం 25 ఏళ్ల పాటు కష్టపడాలని నిర్ణయించుకునే రాజకీయాల్లోకి వచ్చాను: పవన్ కల్యాణ్


25 ఏళ్ల పాటు సమాజం కోసం, పార్టీ తరపున కష్టపడేందుకే రాజకీయాల్లోకి వచ్చానని ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. హైదరాబాదులో పార్టీ కార్యకర్తలతో ఆయన మాట్లాడుతూ, తన లక్ష్యం కేవలం ఎన్నికల్లో సీట్లు గెలవడం మాత్రమే కాదని అన్నారు. ప్రజారాజ్యం పార్టీ విఫలమైన నేపథ్యంలో ప్రతి విషయంలో నిరూపించుకోవాల్సిన పరిస్థితి తనపైన ఉందని ఆయన చెప్పారు. 2018 చివరి నాటికి తన బలాబలాలపై ఒక అంచనా వస్తుందని ఆయన అన్నారు. ఇక్కడ కూర్చుని బలాబలాలను చెప్పడం సహేతుకం కాదని ఆయన అన్నారు. తాను ఊహల్లో ఉండనని, వాస్తవంగా ఆలోచిస్తానని ఆయన అన్నారు. 2019 ఎన్నికల్లో ఎన్ని సీట్లలో పోటీ చేస్తానన్నది ఇప్పుడే చెప్పలేనని ఆయన అన్నారు.

విజయం సాధించని పక్షంలో పోటీ చేసి ఉపయోగం ఉంటుందా? అని ఆయన అడిగారు. అధికారం వస్తుందా? అసెంబ్లీకి వెళ్తామా? అన్నది ప్రశ్న కాదని, పని చేసుకుంటూ పోతే వచ్చేవి ఎలాగూ వస్తాయని ఆయన చెప్పారు. తాను ఒక ప్రాంతం, ఒక భాషకు పరిమితం కాదని ఆయన అన్నారు. సోషల్ మీడియా ద్వారా పార్టీని విస్తరించాలని ఆయన అన్నారు. శతఘ్ని పేరుతో డిజిటల్ టీమ్ ను ఆయన తయారు చేస్తున్నారు. తాను తెలంగాణలోనే పెరిగానని ఆయన చెప్పారు. తెలంగాణలోని జిల్లాల్లో యువత సమస్యపై పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్టు తనకు అనిపించలేదని, ఇంకా నేతల వెనుక, వారికి సపోర్టుగా ఉన్నట్టు అనిపిస్తోందని, వారిలో చైతన్యం రావాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. అయితే కత్తి మహేష్ వివాదంపై ఆయన ఏమీ మాట్లాడకపోవడం విశేషం.

  • Loading...

More Telugu News